మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నటించిన చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగసాయి మాకం దర్శకుడు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాబూ వర్గీస్ సంగీతాన్ని అందించిన పాటలను విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథి డీకే అరుణ మాట్లాడుతూ... ఏ రంగంలో ఉన్న వాళ్ల వారసులు ఆ రంగంలో అడుగుపెడుతుంటారు. అవగాహణ ఉంటుంది కాబట్టి వాళ్లే సదరు రంగాల్లో రాణిస్తారు. కొత్త వాళ్లకు ఇబ్బంది అవుతుంటుంది. మా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన వ్యాపార రంగంలో ఉన్నారు. సినిమాలకు కొత్త. అయినా మంచి చిత్రాన్ని రూపొందించారు. మనకు పైకి కనిపించే సినిమా రంగులమయంగా ఉంటుంది. కానీ దానిలో కష్టాలు సినిమా చేసే వాళ్లకే తెలుస్తాయి. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో మా పాలమూరు జిల్లాకు చెందిన వాళ్లే ఉండటం సంతోషంగా ఉంది. గోరటి వెంకన్న పాటలు రాసి పాడటమే కాదు మంచి పాత్రలో కూడా నటించారు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అన్నారు.
నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ...నాకు చిన్నప్పటి నుంచి కళలంటే ఆసక్తి. సాహిత్యాభిలాష ఉండేది. కవిత్వం రాస్తూ ఉండేవాడిని. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో దర్శకుడిని అవుదామని కృష్ణానగర్ వచ్చాను. కానీ ఇక్కడ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ల కష్టాలు చూసి ఇక్కడ మనం ఉండలేం అని వెళ్లిపోయాను. వ్యాపారంలో స్థిరపడ్డాను. ఆనాడు నాకు మొదలైన కోరికతో ఇవాళ నిర్మాతగా మారి సినిమా చేశాను. మీ అందరి ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. అన్నారు.
గోరటి వెంకన్న మాట్లాడుతూ...నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెద్దగా ఉండదు. ఈ చిత్ర నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ విలువలు తెలిసిన వ్యక్తి. అందుకే నటించేందుకు ఒప్పుకున్నాను. నాకు నాటకాలంటే చాలా ఇష్టం. నాటకం చూస్తున్నంత సేపూ ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే స్థాయి ఆనందాన్ని ఈ చిత్రంలో నటించేప్పుడు పొందాను. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. అన్నారు. దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ...ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇవాళ మా సినిమా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఓ పెద్ద సినిమా స్థాయిలో మార్చి 15న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఆద్యంతం సహజంగా సాగే కథాకథనాలతో సినిమా ఆకట్టుకుంటుంది. సందేశాత్మకంగా ఉన్నా వాణిజ్య అంశాలకు ఎక్కడా లోటుండదు. అన్నారు.