నిజాలేమిటో అందరికి తెలియాలి :శివాజీ రాజా 

08 Mar,2019

ఈ మధ్య కొందరు  మీడియా ముందుకెళ్లి ‘మా’పై లేనిపోని అభియోగాలు చేస్తున్నారు. వాళ్లంతా నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. మేం ఏం చేశామో అందరికీ తెలుసు. మేం తెల్లని వస్త్రంలా స్వచ్ఛంగా ఉన్నాం’’ అన్నారు శివాజీరాజా. ఈనెల 10న జరగబోయే ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలలో శివాజీరాజా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివాజీరాజా ప్యానల్‌  హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ..  ‘‘నరేష్‌, రాజశేఖర్‌, జీవిత.. వీళ్లంతా మీడియా ముందుకెళ్లే ‘మా’ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. అవి వినీ ఊరుకుంటే మేమేదో తప్పు చేశామని ప్రజలు అనుకుంటారు. అందుకే మేం కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఈమధ్య రకరకాల మాటలు వినాల్సివస్తోంది. అవి విని మా కుటుంబం బాధ పడింది. మేం ఎప్పుడూ తప్పు చేయలేదు. ‘ఈసారి కూడా మీరే ఉండండి’ అని ‘మా’ కార్యవర్గ సభ్యులంతా అడిగారు. అందుకే ఇష్టం లేకపోయినా పోటీ చేస్తున్నా. ‘మా’ నిధుల కోసం చిరంజీవిగారితో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాం. రిహార్సల్స్‌ కోసం నరేష్‌ని పిలిచాం. కానీ అప్పుడు రాలేదు. ‘మా’ సభ్యులెవరైనా పుట్టినరోజు జరుపుకుంటే, వాళ్ల ఇంటికెళ్లి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. రాజశేఖర్‌, జీవిత కూడా నిజాలు తెలుసుకుని మాట్లాడండి. యాభై మంది కళాకారులు అవకాశాలు లేక బాధపడుతుంటే, ఓ అజ్ఞాత వ్యక్తి సహాయంతో ఏడాదికి ఆరు నెలల పాటు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నాం. పింఛను రూపంలో ఇస్తున్న రూ.5 వేలని రూ.7500 చేయాలని నిర్ణయించుకున్నామ’’న్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘పేదవాళ్ల కోసం, వాళ్లకు మంచి చేయాలన్న ఉద్దేశంతో శివాజీరాజాని ఈసారి ఎన్నికలలో పోటీ చేయమని మేమే బలవంతం చేశాం. కొన్ని మంచి పనులు కొనసాగాలంటే తనే రావాలి’’ అన్నారు. నాగినీడు, ఎస్వీకృష్ణారెడ్డి, రాజీవ్‌ కనకాల, పరుచూరి వెంకటేశ్వరరావు, పృథ్వీ, రఘుబాబు, రాజ్‌తరుణ్‌, రాజా రవీంద్ర, బెనర్జీ, రవి ప్రకాష్‌, ఏడిద శ్రీరాం, భూపాల్‌ రాజ్‌, వెంకట గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News