కొత్తతరహా సినిమాలు చేస్తాను - నిర్మాత మహేష్ కోనేరు
జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి నిర్మాతగా మారదు మహేష్ కోనేరు. ఈస్ట్ కోస్ట్ సినిమాస్ బ్యానర్ పై మొదటి ప్రయత్నంగా నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా `118` చిత్రాన్ని నిర్మించాడు. కెవి గుహన్ దర్శకుడు. ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా మహేష్ కోనేరు విలేకరులతో చెప్పిన విశేషాలు ..
* తొలి సినిమా కాస్త నిరాశపరిచింది. నా ఓన్ ప్రొడక్షన్లో చేయకపోయినప్పటికీ, నేను అసోసియేట్ అయ్యాను కాబట్టి కాస్త బాధపడ్డ మాట వాస్తవమే. హీరో నమ్మి చేశారు. కానీ అది వర్కవుట్కానప్పుడు బాధ కలిగింది. అది ఆడలేదన్న బాధతో కసిగ మా టీమ్ అందరం చేసిన సినిమా `118`. లక్కీగా బాగా వర్కవుట్ అయింది. కొంచెం మనీ పెట్టి భాగస్వామ్యంతో చేశానంతే. అంతకుమించి నేను పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఈ స్క్రిప్ట్ ను `నా నువ్వే` సమయంలోనే విన్నాం. చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేద్దామని కల్యాణ్ గారు ఫిక్సయ్యారు. నా బ్యానర్లో నేను సోలో నిర్మాతగా చేయడానికి ఇది కరెక్ట్ స్క్రిప్ట్ అనిపించి, నేనే ఆయన్ని రిక్వెస్ట్ చేసి మా బ్యానర్లో చేశాం.
ఇది వైవిద్యమైన స్క్రిప్ట్ అని నాకు ముందు నుంచీ అవగాహన ఉంది. అయితే ప్రయోగం చేస్తున్నామని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే ఈ తరహా థ్రిల్లర్ చిత్రాలను నేను చాలా బాగా ఇష్టపడతాను. అందుకే ఇది వెంటనే చేశాం. కల్యాణ్‌రామ్‌గారి కెరీర్లో ఇదే హయ్యస్ట్ హిట్ సినిమా కాదండీ. పటాస్ మంచి వసూళ్లు తెచ్చింది. అయితే ఈ సినిమాలో ఆయన నటనకు ఎక్కువ స్కోప్ ఉంది. ఆయన పెర్ఫార్మెన్స్ కు చాలా మార్కులు పడుతున్నాయి. అలా ఈ సినిమా ఆయన కెరీర్లో గుర్తుండిపోతుంది.
* 118ని గతేడాది దసరాకు విడుదల చేయాలని అనుకున్నాం అండీ. కానీ అప్పుడు పెద్దాయన ఎన్టీఆర్ బయోపిక్‌లో హరికృష్ణగారి పాత్రను కల్యాణ్‌రామ్‌గారు చేయాల్సి వచ్చింది. అది పెద్ద ప్రాజెక్ట్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో కల్యాణ్‌గారు డేట్లు వాళ్లకు ఇవ్వాల్సి వచ్చింది. మా చిత్రంలో ఏమో ఆయనకు గడ్డం, మీసాలు ఉంటాయి. కానీ అందులో క్లీన్ షేవ్ ఉంటుంది. ఒక్కసారి ఆ సినిమా షెడ్యూల్‌కు వెళ్తే మళ్లీ లుక్ పరంగా మాకు ప్రిపేర్ కావడానికి నెల పట్టేది. ఆ తర్వాత మేం మళ్లీ డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నాం. కానీ అప్పటికీ కాకపోవడంతో ఈ మధ్య విడుదల చేశాం. నివేదా థామస్ పాత్రకు ముందు కథ వినగానే మేం అనుకున్నది ఆమెనే. ఆమె కూడా వెంటనే అంగీకరించారు. రెండో ఆప్షన్ అస్సలు లేదు.
* ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌కు పీ ఆర్ గానే సన్నిహితమయ్యాను. మొదటినుంచీ ఆ కుటుంబం మీద అభిమానం ఉంది. వాళ్ల పూర్వీకులు, మా పూర్వీకులకు బంధుత్వం కూడా ఉందని ఈ మధ్యనే తెలిసింది. నేనేం చేయాలనుకున్నా ఎన్టీఆర్‌గారికి చెబుతాను. ఆయన విని సలహా ఇస్తారు. ఈ సినిమాను చూసి ఆయన ఎంతో ధైర్యంగా ముందుకెళ్లమన్నారు. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు కూడా విడుదలకు ఎంతగానో సహకరించారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు. జర్నలిస్ట్ గా ఉండి రివ్యూలు రాసాను .. అక్కడున్నప్పుడు అదే కరెక్ట్ అనిపించింది. ఇక్కడికి వచ్చాకగానీ నిర్మాత బాధ ఏంటో అర్థం కాలేదు. అలాగని నేను కళాఖండం తీసి మిమ్మల్ని బాగా రాయమని ఎప్పుడూ అడగలేదు. కాకపోతే సినిమా విడుదలకు మూడు వారాల ముందు నుంచి నిద్ర కూడా ఉండదు. ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ మార్నింగ్ షోతోనే తేలిపోతే బాధగానే అనిపిస్తుంది. 100 మంది సినిమాలు చూసినప్పుడు అందరికీ ఒకే రకమైన ఫీలింగ్ ఉండదు కదా. పైగా ఇది వైవిధ్యమైన చిత్రం. అయినా రెండో ఆటకి హిట్ టాక్ వచ్చేసింది. నేను రూపాయి పెడితే రెండు రూపాయలు లాభం వచ్చింది.
నెక్స్ట్ సినిమా కీర్తి సురేష్ సినిమా లైన్లో ఉంది. ఓ షెడ్యూల్ పూర్తయింది. వచ్చేవారం ఇంకో షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత మేలో యు.ఎస్.లో 40 రోజులు షూటింగ్ ఉంటుంది. దాంతో పాటు హరీష్శంకర్గారి దర్శకత్వంలో మా బ్యానర్లో ఓ సినిమా ఉంటుంది. ఆ తర్వాత వైవిధ్యమైన స్క్రిప్ట్ లు వచ్చి. మాకు కనుక నచ్చితే తప్పకుండా ఇద్దరం కలిసి సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాం. ఈ ఏడాది ఆఖరున హరీశ్‌శంకర్ సినిమా మొదలవుతుంది.