బన్నీ సినిమా మిస్ చేసుకున్నా - ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్వ్యూ
ఓరకంటగా కన్ను గీటి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటించిన ‘ఒరు ఆడార్ లవ్ ‘ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినం రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ చెప్పిన ముచ్చట్లు ..
@ పాపులారిటీ ..
వింకిల్ గర్ల్ అనే ట్యాగ్ రావడం కచ్చితంగా నాకు చాలా హెల్ప్ అయ్యింది. మంచి పాపులారిటీ, గుర్తింపును తెచ్చి పెట్టింది. అయితే ఆ పాపులారిటీనీ దాటి ఎదగాలనుకుంటున్నాను. నాకు, మా ఫ్యామిలీ సభ్యులకు అంత పేరు రావడం కొత్తగానే అనిపించింది. నాకు ఆ సమయంలో సెల్‌ఫోన్స్ కూడా ఇవ్వలేదు. నేను బోర్డింగ్ స్కూల్‌లో చదువుకోవడం లేదు. కాలేజ్‌కు వెళ్తున్నాను. కొన్నిరోజులు వరకు ఇంట్లో వాళ్లు నన్ను బయటకు కూడా పంపలేదు. అమ్మనాన్న కాస్త టెన్షన్ పడ్డారు కూడా. మీడియా వ్యక్తులు నేరుగా ఇంటికి వచ్చి కలిసేవారు. వారికి ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని. సోషల్ మీడియా వల్ల పాజిటివ్ ఉంది.. నెగిటివ్ కూడా ఉంది. నా వరకు చూస్తే సోషల్ మీడియా వల్ల మంచే జరిగింది. ఓ రీజనల్ సినిమాలో సాంగ్ వైరల్ అయ్యింది. లక్షల మంది వ్యక్తులు ఆ సాంగ్‌ను చూశారు.
@ ఆ ఒక్క సినిమా కాదు ..
ఒరు ఆడార్ లవ్ సినిమా కారణంగా వచ్చిన క్రేజ్‌తో నాకు తెలుగు సహా ఇతర సినీ రంగాల నుండి అవకాశాలు వచ్చాయి. నేను కొన్నింటిని అంగీకరించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే ఏడాది పాటు ఒరు ఆడార్ లవ్‌స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నాం. ముందుగా మేం సాంగ్ మాత్రమే షూట్ చేశాం. అది రిలీజైంది. మంచి పేరు వచ్చింది. అప్పటికి సినిమా ఇంకా చిత్రీకరించనే లేదు. ఈ సినిమాకు కమిట్ అవడం వల్ల నేను ఇతర సినిమాల్లో నటించలేనని చెప్పానే తప్ప.. రెమ్యునరేషనో మరేదో కారణం కాదు. అవకాశాలు ఎన్ని వచ్చాయంటే ఇన్ని అని కచ్చితంగా చెప్పలేను. తెలుగు లో తర్వాత బన్నిగారితో నటించే అవకాశం వచ్చింది. కానీ చేయలేకపోయాను. కథలను నేనే వింటాను. నా పాత్ర గురించి, కథ గురించి నాన్నగారితో డిస్కస్ చేస్తాను. నిర్ణయం నాదే.
@ శ్రీదేవి సినిమాకోసం ..
`శ్రీదేవి బంగ్లా` సినిమాకు సంబంధించి నాకు లీగల్ నోటీసులు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. నా సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ ఉండాలని అనుకోను. ఒకవేళ మీరన్నట్లు ఏదైనా సమస్య ఉంటే డైరెక్టర్, నిర్మాతలకు సంబంధించింది. నావరకు నా పాత్రను నేను ఎలా చేశాననే చూసుకుంటాను. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఆ సినిమాను ఒప్పుకున్నాను. నేను మలయాళీ అమ్మాయి అయినా నాకు నార్త్ ఇండియా, హైదరాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో అభిమానులున్నారు.
@ నటిగా ..
నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. పర్టికులర్‌గా ఉన్న ట్యాగ్స్‌ను దాటి ఎదగాలనుకుంటన్నాను. అంతే తప్ప ఒత్తిడిగా భావించడం లేదు. `ఒరు ఆడార్ లవ్`లో కన్నుగీటే సీన్ వన్ టేక్‌లో చేశాను. ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయలేదు. నా కుటుంబంలో ఎవరికీ సినిమాలతో సంబంధం లేదు. చిన్నప్పట్నుంచి సినిమాలను ఎక్కువగా చూస్తుండేదాన్ని. నా స్నేహితులు నాతో ఎప్పటిలాగానే ఉంటున్నారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడాన్ని ఇష్టపడతాను.
@ స్కూల్ లైఫ్ లో ...
ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలవుతోన్న మలయాళ సినిమా. సినిమాపై అంచనాలున్నాయి. స్కూల్ లైఫ్‌లో జీవితం గురించి చెప్పే సినిమా ఇది. నాకు `ఒరు ఆడార్ లవ్` పాటకు సంబంధించి ఎంతోహైప్ వచ్చింది. మరో పక్క విమర్శలు కూడా వచ్చాయి. కొందరు ఆ పాటలో నటించొద్దు అని కూడా అన్నారు. నా తొలి సినిమాతోనే చాలా విషయాలు నేర్చుకున్నాననిపించింది. నా తదుపరి చిత్రాల గురించి ఇప్పుడే చెప్పలేను.