ఈ పదేళ్ళ జర్నీలో చాలా ఎత్తు పల్లాలు చూసాను - హీరో తనీష్
బాల నటుడిగా పరిచయం అయిన తనీష్ హీరోగా పదేళ్ళ మైలురాయిని దాటుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. నచ్చావులే విడుదలయి ఈ రోజు(19.12.18) కి పదేళ్ళు పూర్తయ్యింది. నటుడిగా 20 యేళ్ళు, హీరోగా పదేళ్ళ ప్రయాణం పూర్తి అయిన తరుణంలో తన వెన్నంటి నిలిచిన మీడియా తో కాసేపు మాటలు కలిపారు తనీష్.
ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ: ‘‘నాకు చిన్నప్పటి నుండి డాన్స్ లంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చి తో ఎక్కడ పాట కనపడినా వెళ్ళి డాన్స్ లను చేసే వాడిని. మా నాన్నగారు(వర్ధన్ బాబు) డిఫెన్స్ లో పనిచేసే వారు. అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతుండేవి వాటిలో చాలా ఇష్టంగా పాల్గొనే వాడిని ఆ ఇష్టం నన్ను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. బాలనటుడ్ని చేసింది. బాలనటుడిగా రోజుకి మూడు షిప్ట్ లు చేసే వాడిని, నా కెరియర్ కోసం మా నాన్నగారు తన జీవితంలో అతి పెద్ద రిస్క్ చేసి తన జాబ్ కి వాలెంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. తర్వాత చాలా కష్టాలు చూసాం. కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. కానీ నా మీద నమ్మకం, ధైర్యం ఎప్పుడూ నా తల్లిదండ్రులు కోల్పోలేదు. నచ్చావులే సినిమా టైం లో నాకు మరొక సినిమా హీరోగా ఆఫర్ వచ్చింది. కానీ ఆ కథ అంతగా నచ్చలేదు. ఆ టైం లో నచ్చావులే సినిమా ఆడిషన్స్ కి అటెండ్ అయ్యాను.
‘దర్శకుడు రవిబాబు గారు నన్ను చూసిన వెంటనే నువ్వు తగ్గితే అప్పుడు ఆలోచిస్తా’అన్నారు. మా నాన్నగారు ఇన్నాళ్ళు చూసాం. ఇప్పుడు వెనకడుగు వెయడం ఎందుకు అని హీరో ఆఫర్ ఇచ్చిన వారికి వద్దని చెప్పి, నచ్చావులే కోసం తగ్గడం మొదలు పెట్టాను. పదిహేను రోజుల్లో పదికేజీలు తగ్గిన తర్వాత తర్వాత రవిబాబు గారిని కలిస్తే ‘ రేపు సినిమా ఓపెనింగ్ వచ్చేయ్’అన్నారు. ఆ సినిమా చేసే టైం లో ఇంజనీరింగ్ చేసే వాడిని నేను ట్రావెల్ చేసే బస్ లో నా పాటలు ప్లే అయ్యేవి . కానీ అవి నావని చెప్పుకోవాలని ఉన్నా చెప్పలేదు. సినిమా రిలీజ్ రోజు ప్రెండ్స్ తో థియేటర్ కి వెళ్ళాను. బయటికి వచ్చి చూస్తే సినిమా పెద్ద హిట్ అనే రిపోర్ట్ తెలిసింది. ఈ అవాకాశం ఇచ్చిన రామోజీ రావు గారికి రవిబాబు గారికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. బాల నటుడిగా 60కి పైగా సినిమాలు, హీరోగా 20 సినిమాలు కంప్లీట్ చేసాను.
నా ఈ జర్నీ లో ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. మొదటి గా మీడియా నా ప్రతి సందర్భంలో నా వెంట ఉంది.
రెండు నా తల్లిదండ్రులు, తర్వాత ప్రేక్షకులు. ఈ ముగ్గురు నా గుడ్ అండ్ బ్యాడ్ లో నావెంట ఉన్నారు. నా కెరియర్ లో హిట్స్ ఉన్నాయి ప్లాప్స్ ఉన్నాయి. కానీ నా జర్నీ మాత్రం కొనసాగుతుంది. నేను తెలియక చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. వాటిలో ఒకటి మీడియా కి దూరంగా ఉండటం. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని మీడియాతో పంచుకోవాలనిపించింది. నా ప్రతి అడుగులోనూ మీడియా నాకు సపోర్ట్ చేసింది. నా మంచి, చెడును ప్రజలముందు పెట్టింది. కెరియర్ లో పడ్డాను, లేచాను. ఈ పదేళ్ళ జర్నీలో చాలా ఎత్తు పల్లాలు చూసాను. అవి నన్ను రాటు తేల్చాయి.
నేను హీరో అనే మైండ్ సెట్ తో ఇండస్ట్రీ కి రాలేదు. అలాంటి పాత్రలు అని గిరిగీసుకోలేదు. నా కొన్ని సినిమలు బాగున్నాయని టాక్ వచ్చిన ఆశించిన విజయం సాధించని సందర్భాలున్నాయి కానీ అది పబ్లిసిటీ లోపమా..? సరైనా రిలీజ్ దొరకకా..? లాంటి విషయాలపై ఎవరి మీదా కంప్లైంట్స్ లేవు. బిగ్ బాస్ నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప్రతి ఇంటిలోకి తీసుకువెళ్ళింది. ఆ షో నాకు చాలా ఎమోషనల్ మూమెంట్స్ ని మిగిల్చింది. రంగు తర్వాత మరో కథను ఫైనలైజ్ చేసాను. మిగిలిన వివరాలు తర్వలో అందిస్తాను. ఈ పదేళ్ళ జర్నీలో నాకు తొడుగా నా తమ్ముళ్ళు కుష్వంత్, వంశీ ఉన్నారు. అలాగే మీడియా కి ప్రత్యేక ధన్యవాదాలు. ’’ అన్నారు.